Friday, 15 July 2011

షిర్డి సాయిబాబా జాతక విశ్లేషణ


నిజానికి నేను బాబా గారి జాతకచక్రము గురించి గాని ఆ చక్ర విశ్లేషణ గాని ఎటువంటి ప్రయత్నము చెయ్య లేదు. అనుకోకుండా ఒకరోజు నా దినచర్య ఐనా వెబ్ విహారములో ఒక సైటు విపరీతముగా ఆకర్షించింది. ఇక అందులో విహరిస్తున్న నాకు బాబా గారి జన్మించిన తిధి వార విషయములు కనపడింది. 1838వ సంవత్సరము జన్మించిన బాబా గారి జాతక చక్రం తయారు చేద్దాం అనుకోని మొదలుపెట్టాను. అంతే ఒకటి తరువాత ఒకటి అన్నీ విషయములు చూడటము వాటిని వర్డ్ ఫైల్ తయారు చేయడము అయినది. వాటిని పబ్లిష్ చెయ్యవచ్చో లేదో కూడా తెలియదు. కానీ శ్రీ సత్యసాయి గారి విశ్లేషణ వ్రాసిన మీదట దానికి అందిన ప్రోత్సాహముపై షిర్డి బాబా గారి విశ్లేషణ ఇవ్వటము జరిగినది. మీ సలహాలు ప్రోత్సాహము ఇలాగే ఉంటే తరువాతి విశ్లేషణ మాజీ ప్రధాన మంత్రి, రాహుసర్ప యోగము కలిగిన వారి గురించి వ్రాద్దామని నా సంకల్పము. 
బాబా గారి జన్మ వివరములు దొరికిన వెబ్ సైటు లింకు: ఇక్కడ నొక్కుము
contributor: Subhasrini (Thanks to the contributor for giving the opportunity)

శ్రీ షిర్డి సాయిబాబా జాతక చక్రములో సూర్యుడు లగ్నము నుంచి 10వ స్థానము అంటే కర్మ స్థానములో గురుగ్రహమును, కేతుగ్రహమును combust చెయ్యడము చూడగలము. అంటే 'గురు మౌడ్యమి' అన్న మాట. లగ్నము గురువే కావడము కేతువు చంద్ర నక్షత్రమైన హస్త మీద ఉండుట వలన వారిరువురి మధ్యగల నైసర్గిక స్నేహముతో(గురువు, చంద్రుడు) ధార్మిక జీవితానికి భాష్యము బాబా గారి జీవితము ద్వారా చూపించగలిగారు భగవంతుడు.  చంద్రుడు పూర్వాషాడ నక్షత్రముపై ఉండుట వలన ప్రతి స్త్రీ తనలో గల నాలుగు అంశలలో మూడొంతులు పరోక్షముగా బాబా గారికి అందించడములో బాబా గారి జీవితము ధన్యమైనది. అలాగే శుక్రుడు సింహములో తన నక్షత్రములోనే గురు విభాగములో ఉండుటవలనను, కుజుడు నీచములో ఉండుట వలనను, కళత్ర స్థానాధిపతి ఐనా బుధుడు వక్రించుట వలన సంసార యోగము లేదు అన్నది గమనించగలము.  

 
ఏ రెండు గ్రహములైన అతి తక్కువ దూరములో కలసి ఉంటే వాటిలో బలవంతుడైనే గ్రహముచే ఆకర్షించబడిన రెండవ గ్రహము తన శక్తి సామర్ధ్యములను అప్పగించి నిర్వీర్యమై పోతుంది. అటువంటి జాతకుడు ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తాడో మనకు శ్రీ సత్యసాయి బాబా జీవితమును గమనిస్తే తెలుస్తుంది. అక్కడ రజో గుణ గ్రహములు సూర్యునితో అస్తంగత్వము జరిగి ఆ ఆత్మకారకుడు రాజులాగా జీవితాన్ని గడపడము చూసాము.    అలాగే దానికి విరుద్దముగా సూర్యుడు సత్వ గుణకారుడైన గురు గ్రహమును మరియు తమో గుణకారుడైన కేతువును అస్తంగత్వము చేసి శ్రీ షిర్డి సాయి బాబా జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చడము చూసాము. మానవులైన వీరిరువురు కేవలము గ్రహస్థానముల పరముగా అత్యంత స్థితికి ఎదిగి దైవముగా నిలుచున్నారంటే ఎన్నో కోట్లమంది జనాభా కలిగిన ఈ విశ్వములో ఇటువంటి వారు ఎంతటి అరుదుగా ఉంటారో ఆలోచిస్తే మనము చేస్తున్న తప్పు ఏమిటో తెలుస్తుంది.
  
నిజమైన ధార్మిక జీవితము అనేది అత్యంత శుభప్రదమైనది. ఎంతో పుణ్యం చేసుకొంటే గాని లభించని జీవితము. ఈ జీవితములో స్వార్ధము, కపటము అనేది ఉండదు. ఇతరులకు సహాయ పడటము అనేది అత్యంత ఉచ్చ స్థితిలో ఉండే తత్వము. కానీ కర్మ సిద్దాంతము ప్రకారము పై “అభిప్రాయము” పూర్తి విరుద్దముగా వస్తుంది. అందువలన అది అప్రస్తుతము.  జ్యోతిష్య శాస్త్ర పరముగా బృహస్పతి అను గ్రహమును పై విధముగా నిర్వచించవచ్చు. అందుకే గురు గ్రహము సహజ శుభకరుడు అని శాస్త్రము ద్వారా తెలియ వస్తుంది.  అంతే కాక “మానవ సేవే మాధవ సేవా” అనేది ఈ ధార్మిక జీవితానికి మూలాధారము. ఎవరి జాతక చక్రములో “బృహస్పతి” ప్రముఖ పాత్రను పోషిస్తాడో వారి జీవితాలన్నీ ఈ రకమైన ధార్మిక జీవితానికి ఎంతో ముడిపడి ఉంటుంది. వీరికి తెలుసు భగవంతుడు అనేది సేవా కార్యక్రమమే కానీ ఆకార పూజా కార్యక్రమము కాదు అని మరియు ప్రతి జీవిలోను వీరు భగవంతుడిని ప్రత్యక్షముగా చూడగలరు.  ఇటువంటి ధార్మిక తత్వము తెలియని వారు లేదా జాతకరీత్యా ఆ తత్వము కొరపడినవారు మాత్రము విగ్రహారాధన లేదా దేవాలయముల చుట్టూ తిరుగుతూ తమ ధార్మిక తత్వములోని పరిమితులను చూపిస్తారు. ఈ సేవాతాత్పరతను విభిన్న కోణాలలో చూడవచ్చు. రజో గుణతత్వము కలవారు ధనసహాయము మాత్రమే చేస్తూ అనేక అభివృద్ది పనులు చేస్తారు. సత్వ గుణతత్వము కలవారు తామే ప్రతిపనిలో లీనమై ఎటువంటి పనులైన చేయగలరు. వీరిద్దరికి విరుద్దముగా తమో గుణతత్వము కలవారు సమాజములో గల చెడును మాత్రమే ఏరివేయుటలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ వారి గుణతత్వమును సమర్దిస్తారు.  

పై విధముగా మోక్షకారకుడైన కేతువు కూడా ఇదే ధార్మికతత్వమును అనేక విభిన్న కోణములలో ప్రదర్శిస్తూ అందులో అధ్యాత్మిక భావాన్ని మిళితము చేస్తూ చాదస్తాన్ని అందచెయ్యడము చూస్తాము.  ఐతే చాదస్తపు పాళ్ళు ఎక్కువగా కలిగిన కేతువు ఎదుట వారినుంచి సహాయము ఎటువంటి పరిస్థితిలోనూ ఆశించక తమ మనుగడను సాగిస్తారు. అందువలన ఇటువంటి జాతకులనుంచి అధికమొత్తములో ధన సహాయము లభించక కేవలము మాట సహాయము మరియు దైవ సహాయము మాత్రమే లభించును. ఇందుమూలముగా ఈ జాతకుల పూర్వపుణ్యము కోరుకున్న వారికి ఆయాచితముగా లాభిస్తుంది. దీనినే మహిమలుగా చూడవచ్చు.
                                                               సందేహాలకు Email me

1 comment:

  1. Thappu andi babagaru eppudu thana puttina visheshalu cheppaledu idi evarido ooha kalpithamu. kabatti idi thappu

    ReplyDelete